క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
వరంగల్ మేయర్ గుండు సుధారాణి
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడారంగానికి విశేష ప్రాధాన్యం కల్పిస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు.
హనుమకొండ జేఎన్ఎస్ ప్రాంగణంలో నిర్వహించిన చీఫ్ మినిస్టర్స్ కప్ -2024 జిల్లా స్థాయి పోటీల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి బడ్జెట్లో రూ. 375 కోట్లు కేటాయించారని తెలిపారు.
హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ముఖ్యంగా పోటీలలో పాల్గొనే స్ఫూర్తి కీలకమని చెప్పారు. హనుమకొండ జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధి చెందేలా క్రీడాకారులు ప్రతిభ చూపాలని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ మండలాల క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి వారిని మేయర్ పరిచయం చేశారు. హ్యాండ్ బాల్ పోటీతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, జిల్లా యువజన క్రీడా అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments