సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ కడియం కావ్య
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్ నాగరాజులతో కలిసి వరంగల్ అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని ఎంపీ కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం ఇచ్చిన హామీల ప్రకారం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు, టెక్స్‌టైల్ పార్క్, ఐటీ, పర్యాటక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం, వరంగల్‌ను అన్ని రంగాల్లో హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయని వెల్లడించారు.
వరంగల్‌ను రెండవ రాజధానిగా అభివృద్ధి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేయగా, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments