పాఠశాల ఉపాధ్యాయుల ధ్యేయం నాణ్యమైన విద్య అందించడమే
మండల విద్యాధికారి డాక్టర్ రాంధన్
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ఉపాధ్యాయుల ధ్యేయంగా ఉండాలని మండల విద్యాధికారి డాక్టర్ రాంధన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ధర్మ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంధన్ ‘ది క్రియేటివ్ నెక్సస్’ పేరుతో పాఠశాల దృశ్యమాలికను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. సంఖ్యతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని, అదే ప్రస్తుత పరిస్థితుల్లో వారి ప్రధాన కర్తవ్యమని సూచించారు.
గౌరవ అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళి మాట్లాడుతూ, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరారు.
విద్యార్థులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీలు, సాహితీ, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు.విద్యార్థుల ప్రదర్శించిన బృంద నృత్యాలు సభను అలరించాయి.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉమా, భాగ్యలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు కవిత, సురేష్, పద్మజ, రాజమ్మ, కిరణ్మయి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Comments