సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెంబ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు,కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.దొంగతనాల నివారణకు,రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లాలోని ప్రధాన రహదారులు,ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశ్రమల యాజమాన్యాలు,వ్యాపారస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు మరియు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.నేరాలను ఛేదించడంతోపాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు.కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ తాము నివసించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Comments