బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేస్తాం..
ఆర్బీఐ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
డెస్క్ ,తెలంగాణ ముచ్చట్లు:
చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకింగ్ చట్టాల్లో (Banking Acts) సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) అన్నారు. అదేవిధంగా నామినీ చట్టాల్లో కూడా మార్పులు తీసుకువస్తామని ఆమె ప్రకటించారు. ఈ మార్పుల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ కస్టమర్ ఫ్రెండ్లీగా మారుతుందని చెప్పారు.
శనివారం ఢిల్లీలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌ల సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకులకు ఆమె పలు సూచనలు చేశారు. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లపై దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయని అన్నారు. కాగా అనేక ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు.
ఈ క్రమంలోనే శుక్రవారం లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలకు సంబంధించిన అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరగటంపై కూడా మోదీ సర్కార్ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం మార్చి 31, 2024 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన బ్యాంకుల వద్ద ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరుకుంది.
ఈ నేపథ్యంలోనే ఒక ఖాతాకు కస్టమర్లు నలుగురు నామినీలను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లు 2024 నిర్ణయించింది. దీనికి ముందు వరకు ఒక ఖాతాకు కేవలం ఒక నామినీని మాత్రమే కస్టమర్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త చట్టాలు అమలులోకి వస్తే తదనుగుణంగా నామినీలను వినియోగదారులు పెంచుకోవచ్చు.
ఈ మార్పు ద్వారా సదరు ఖాతాదారులు మరణిస్తే డిపాజిట్లు లేదా ఇతర మెుత్తాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి చట్టపరంగా నామినీలకు అవకాశం కల్పించబడుతుంది. దాంతో భారీగా పెరుగుతున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏకకాలంలో 4 చట్టాలను సవరించేందుకు ప్రయత్నించటాన్ని ఆర్ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
Comments