AI ఎఫెక్ట్.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆరు నెలల్లో రెండో సారి..!
డెస్క్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. మాంద్యం భయాల కారణంగా ఇప్పటి వరకూ వందలాది సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. అయితే, ఇప్పుడు ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. రెండు రోజుల క్రితం డెల్ టెక్నాలజీస్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని ఏకంగా 12500 మందిని డెల్ విధుల నుంచి తొలగించింది.
ఇప్పుడు మరో సంస్థ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో (Cisco Layoffs) భారీగా కొలువుల కోతకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వ్యాపార పునర్వ్యవస్థీకరణకు పూనుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో దాదాపు 4,000 మందికి లేఆఫ్‌లు ప్రకటించిన ఈ సంస్థ తాజాగా అదే సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైనట్లు (second round of layoffs) తెలిసింది. ఆరు నెలలు గడవకముందే మళ్లీ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సరఫరా చైన్‌లో సమస్యల కారణంగానే కంపెనీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు 2025 నాటికి ఏఐ ఉత్పత్తుల ఆర్డర్‌లో బిలియన్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాయిటర్స్ నివేదించింది. కాగా, సిస్కోలో ప్రపంచవ్యాప్తంగా 84,900 మంది పనిచేస్తున్నట్లు అంచనా. తాజా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా తగ్గనుంది.
Comments