వారం చిట్టీలు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు
భూపాలపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు ఆర్థిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన బుధవారం చోటుచేసుకుంది. వారి ఇద్దరి ఆత్మ హత్యలతో వారి ఇద్దరు పిల్లలు రిషి (14), జశ్వంత్ (12) అనాథలుగా మిగిలారు.
వీరు వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు మహిళల గ్రూపులను ఏర్పాటు చేసి రుణాలు ఇస్తుండగా, చందన సభ్యురాలిగా ఉన్న సంఘం ద్వారా రూ. 2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. ఈ అప్పు ప్రతివారం రూ. 2200 చెల్లించాలని ఒప్పందం జరిగింది.
ప్రారంభంలో క్రమంగా చెల్లించినా, భర్త, పిల్లలు అనారోగ్యంతో బాధపడటం వల్ల చందన కిస్తీలు కట్టలేకపోయింది. ఫైనాన్స్ యజమాని నుండి ఒత్తిడి పెరగడంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. డిసెంబరు 6న చందన గడ్డి మందు తాగగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన దేవేందర్ డిసెంబరు 20న ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతి చెందింది. ఈ విషాద ఘటన గ్రామాన్ని కుదిపేసింది.
సమస్యలపై స్పందన అవసరం
ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నియంత్రణ లేకపోవడం, రుణగ్రస్తులపై అధిక ఒత్తిడి కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Comments