పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం
జనవరి 26 నుంచి పేదోడు మెచ్చే నాలుగు హామీలు అమలు కాబోతున్నాయి
- ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుంది
- ఎవరో రెచ్చగొట్టే మాటలు విని అభద్రతకు లోను కావొద్దు
- తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ మల్లెమడుగు గ్రామంలో శనివారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు అందించారు. లబ్ధిదారుల కోరిక మేరకు వారి ప్లాట్లలోకి వెళ్లి పాలను పొంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.... ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పంపిణీ ప్రక్రియ మొదలైందని అన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి పట్టాలు అందించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు, గ్రామ పెద్దలు నిర్ణయం మేరకే అర్హులను గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని వారు ఎవరో రెచ్చగొట్టే మాటలు విని అభద్రతకు లోను కావొద్దని పేదలకు సూచించారు. మరో పదిహేను రోజుల్లో అంటే ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఇచ్చిన మాట ప్రకారం మరో నాలుగు హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. భూమి లేని రైతు కూలీలకు రెండు విడతలుగా ఏడాదికి రూ. 12వేలు ఇచ్చే కార్యక్రమం, భూమి ఉండి సాగు చేసుకునే ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ. 12 వేలు, అర్హులైన ప్రతి పేదవాడి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో పాటు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5లక్షలు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం చేకూరే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, 1వ, 59వ,60వ డివిజన్ల కార్పొరేటర్లు హుస్సేన్ , నిరంజన్, బట్టపోతుల లలితా రాణితో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments