మహిళా దొంగల ముఠా అరెస్ట్.
17 1/2 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసే మహిళా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపి కె. దేవేందర్ రెడ్డి కేయూసి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక అత్త ఇద్దరు కోడలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నట్లు విజయనగర్ కాలనీ, గోపాల్పూర్ భీమారం ఏరియాలలో ఇనుప సామాన్లు ఏరుకుంటూ ఇంటికి తాళం వేసిన ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు నగదును దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇనుప సామాన్లు ఏరుకొని జీవనం సాగిస్తూ వచ్చే డబ్బులు తమ కుటుంబ పోషణకు,జల్సాలకు సరిపోకపోవడంతో అత్త కడమంచి లచ్చమ్మ, తన ఇద్దరు కోడళ్ళు తూర్పాటి రాజీ మేరీ, పర్వతం కనక లక్ష్మీ లతో కలిసి ప్లాను ప్రకారం ఒక ముఠాగా ఏర్పడి తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇద్దరి కోడళ్లను ఇంట్లోకి పంపించి లచ్చమ్మ కాపలాగా ఉంటూ దొంగతనాలు చేస్తూ దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన విజయనగర్ కాలనీలో సయ్యద్ అసిఫ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లగా అత్త కోడళ్ళు తాళం పగలగొట్టి 17 1/2 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లగా వెంటనే స్పందించిన కేయుసి ఇన్స్పెక్టర్ ఎస్. రవికుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి. బాలాజీ వరప్రసాద్ రెండు బృందాలుగా ఏర్పడి సిసి టీవీ ఫుటేజ్ ల ఆధారంగా లోకల్ ఇంటలిజెన్స్ సహకారంతో పై నేరస్తులను గుర్తించి భీమారం జంక్షన్ వద్ద అరెస్టు చేసి ఒక నక్లెస్,నాలుగు గాజులు,మూడు రింగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా సంక్రాంతి సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకు వెళ్లేటప్పుడు పక్క ఇళ్ళ వారికి గాని లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని,ఇళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపి సూచించారు. ఈ కేసు చేదించిన కేయూసి ఇన్స్పెక్టర్ రవికుమార్, సిసి ఎస్ ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు బి.రవీందర్, పి.శ్రీకాంత్, ఏ ఏ ఓ సల్మాన్ పాషా, కేయూ క్రైమ్ సిబ్బంది జి.నర్సింగరావు,పాషా,పి.రవి ప్రసాద్ రెడ్డి,జితేందర్, సిసిఎస్ సిబ్బంది ఏఎస్ఐ శివకుమార్, హెచ్ సి నసీమ్, అహ్మద్, కానిస్టేబుల్ మధుకర్, చంద్రశేఖర్, రాములు,వెంకన్న లను హనుమకొండ ఏసీపి అభినందించారు.
Comments